మనం దిక్కులు అనగానే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెప్పుకుంటాం. వాస్తు శాస్త్రం.. మరో 4 దిక్కులను కూడా చెబుతుంది. అవే ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం (ఆనైవాఈ). ఈ నాలుగు దిక్కుల్లో ఏయే వస్తువులు ఎక్కడ ఉండాలో వాస్తు నిపుణులు చెబుతారు. అవి అలా ఉంటే, వాస్తు దోషం ఉండదని అంటారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆగ్నేయం:
ఆగ్నేయ దిశలో కిచెన్ గది ఉంటూ, అందులో స్టవ్‌ని ఆగ్నేయ మూలలో ఉంచాలి. వంట వండేటప్పుడు వచ్చే పొగ బయటికి వెళ్లేలా దక్షిణ ఆగ్నేయం (SE), తూర్పు ఆగ్నేయం (ES)లో కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వంట వండేటప్పుడు తప్పనిసరిగా కిటికీలు తెరచి ఉంచాలి. తద్వారా పొగ బయటకు పోయి, క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుంది.
నైరుతి:
నైరుతి దిశలో మనకు కావాల్సిన వస్తువుల్నీ, విలువైన వాటినీ, పత్రాలనూ దాచుకోవాలి. ఇంటి యజమాని ఈ దిశలో ఉండాలి. త్వారా దక్షిణం నుంచి వచ్చే గాలి ఇంటి యజమానికి తగులుతుంది. పడమర నైరుతి (WS), దక్షిణ నైరుతి (SW) దిక్కు నుంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ గది కీలకమైనది కాబట్టి భద్రత పరంగా గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే.. నైరుతి దిశలో బరువు ఉండాలి. అందువల్ల నీటిని స్టోర్ చేసే ఓవర్‌హెడ్ ట్యాంకును ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు.
వాయవ్యం:
వాయవ్య దిశలో బాత్‌రూమ్, టాయిలెట్, పశువుల పెంపకం వంటివి చేస్తారు. ఈ దిశ నుంచి వచ్చే గాలి, చెడు వాసనలు ఇంట్లోకి రాకుండా, ఆ వాసనలు బయటకు పోయేలా ఏర్పాట్లు ఉండాలి.
ఈశాన్యం:
ఈశాన్య దిశలో నుయ్యి లేదా బోరు వేసుకోవచ్చు లేదా నీటిని స్టోర్ చేసే సంపు కూడా నిర్మించుకోవచ్చు. ఈ దిశలో ఎక్కువ స్థలం ఖాళీగా ఉండాలి. ఎండ, గాలి బాగా వచ్చేలా చెయ్యాలి. తద్వారా నీరు శుభ్రంగా ఉంటుంది.
ఇంకా వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని మొత్తం అర్థం చేసుకోవడానికి ఓ సంవత్సరం పట్టొచ్చు. వాస్తు శాస్త్రం చాలా విస్తృతమైనది. ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని ఫాలో అవుతున్నాయి. కొన్ని దేశాల్లో వేర్వేరు పేర్లతో ఇది ఆచరణలో ఉంది. ఇండియాలో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు, భవనాలు, బ్యారేజ్‌లు ఇలా ప్రతీ దానికీ ఇంజినీరింగ్ ఫార్ములాలతోపాటూ.. వాస్తు నియమాలు కూడా పాటిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తున్న ఆచారంగా మారింది. వాస్తును నమ్మని వారు సైతం.. తమ ఇళ్ల నిర్మాణంలో వాస్తును పాటిస్తుంటారు. పాటిస్తే పోయేదేముంది అని భావిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని E-పలుకు నిర్ధారించట్లేదని గమనించగలరు.

No comments:
Post a Comment