ఇప్పుడు మనం వాడుతున్న టీవీ, సెల్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, కెమెరాలు, టార్చ్‌లైట్లు, వాల్ క్లాక్‌లూ ఇవన్నీ.. మనిషి అవసరాలతో పుట్టినవే. అవసరం కొత్త వాటిని కనిపెట్టేలా చేస్తుంది. కాలం గడిచే కొద్దీ టెక్నాలజీ కొత్త రూపం సంతరించుకుంటూనే ఉంటుంది. రోబో టెక్నాలజీ కూడా అలా పుట్టిందే. రోబో (Robot)కి తెలుగు పదం మరమనిషి. కానీ మనం రోబో అనే పిలుస్తుంటాం. ఎందుకంటే మనం ఇంగ్లీష్ పదాల్ని మన తెలుగులో కలిపేసుకుంటాం. దాంతో అవి తెలుగు అయిపోతాయి. ఆ విషయం అలా ఉంచితే, తొలి రోబోను 1948లో ఇంగ్లాండ్ లోని గ్రేవాల్టర్ తయారుచేశారు. దాన్ని ఎలక్ట్రానిక్ ఆటోనామస్ రోబోట్ (Electronic Autonomous Robots) అని పిలిచారు.
చరిత్ర:
క్రీస్తుపూర్వం 450 సంవత్సరంలో గ్రీకు గణిత శాస్త్రవేత్త ఆర్కిటస్ ఒక మరపక్షిని తయారుచేసి.. ఆవిరి ద్వారా ఎగరేశారని తెలుస్తోంది. ఆధునిక యుగంలో రోబో అనే మాటను మొదట కారెట్ లేపెక్ అనే చెక్ రచయిత ఉపయోగించారు. చెక్ భాషలో రోబో అంటే బానిస అని అర్థం. ఆయనకు ఆ పదాన్ని, ఆయన తమ్ముడైన జోసఫ్ లేపెక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
1950 తర్వాత రోబోల తయారీ జోరందుకుంది. అమెరికా, జపాన్ దేశాలు అభివృద్ధి చెందుతూనే, రోబోల తయారీపైనా దృష్టి పెట్టాయి. ఆ తర్వాత రోబోల తయారీ కోసం రోబోటిక్స్ అనే సైన్స్ వచ్చింది. ఇప్పుడు రోబోలు తయారుచేసేవారు.. రోబోటిక్స్ నేర్చుకుంటున్నారు.
చాలా ప్రయోజనాలు:
రోబోలను చాలా సినిమాల్లో నెగెటివ్‌గా చూపిస్తున్నారు. నిజానికి అవి మనిషి కంట్రోల్‌లో పనిచేసే యంత్రాలు మాత్రమే. మనం ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, టీవీ ఇవన్నీ ఎలా వాడతామో, రోబోను కూడా అలాగే వాడగలం. కాకపోతే అవి మనిషి ఆకారంలో ఉండటంతో.. అవి మనకు వ్యతిరేకంగా మారతాయేమో అనే సందేహం వస్తూ ఉంటుంది. నిజానికి ఇప్పుడు రోబోలు లేని రంగం లేదు. గనుల్లో, బాంబుల్ని తొలగించే పనుల్లో, ఆస్పత్రుల్లో సర్జరీలు చెయ్యడానికీ, ఇంట్లో పనిమనిషిలా, పెరట్లో కుక్కలా, ఫ్యాక్టరీల్లో కార్మికుడిలా, హోటళ్లలో సేవకుల్లా, స్కూల్లో టీచర్లలా ఇలా రోబోలు చాలా పనులు చేస్తున్నాయి.
ఇండియాలో రోబో విప్లవం ఇంకా రాలేదు. ప్రస్తుతం మొబైల్ విప్లవం, సోలార్ విప్లవం, డ్రోన్ విప్లవం, ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం నడుస్తున్నాయి. త్వరలోనే రోబో రివల్యూషన్ కూడా వచ్చి తీరుతుంది. దీనికి AIతో దగ్గర సంబంధం ఉంటుంది. AI మరింత విస్తరించాక, రోబోలు ఇంటింటికీ వచ్చేస్తాయి.
జపాన్ లాంటి దేశాల్లో రోబోల వాడకం బాగా పెరిగింది. కరోనా వ్యాధి వచ్చినప్పుడు రోగుల దగ్గరకు మనుషుల బదులు రోబోలు వెళ్లి సేవలు అందించాయి. ఇలా మనిషి చెయ్యలేని చాలా పనులను రోబోలు చేస్తున్నాయి. ప్రస్తుతం సింథటిక్ తొడుగులతో అచ్చం మనిషిలా మాట్లాడే, హావభావాలు పలికించే రోబోల కాలం నడుస్తోంది. అందువల్ల మున్ముందు ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పొంచివున్న ప్రమాదం:
రోబోలు మనిషిలా ఆలోచించడం మంచిది కాదు అనే అభిప్రాయం కొందరు శాస్త్రవేత్తల్లో ఉంది. అలా ఆలోచించే రోబోలు.. మనిషి తరహాలోనే స్వార్థాన్ని పెంచుకొని, వినాశనాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకూ అలా జరగలేదు. భవిష్యత్తులోనూ అలా జరగకూడదని కోరుకుందాం.

No comments:
Post a Comment