చెట్లతో మనకు విడదీయరాని బంధం ఉంటుంది. మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్‌ని చెట్లు పీల్చుకుంటాయి. అలాగే అవి వదిలే ఆక్సిజన్‌ని మనం పీల్చుకుంటాం. ఈ విశ్వంలో చెట్లు లేకపోతే, మనం కూడా లేనట్లే. అది అలా ఉంచితే, చెట్టు కిందకు వెళ్లగానే, ఆ నీడ మనకు చల్లని ఫీల్ కలిగిస్తుంది. అదే ఏ భవనం సెల్లార్ లోకో వెళ్తే, ఉక్కపోతగా ఉంటుంది. ఎందుకీ తేడా అని ఎప్పుడైనా ఆలోచించారా?
దీనికి సింపుల్ ఆన్సర్.. చెట్లకు జీవం ఉంటుంది.. భవనాలకు ఉండదు అనే. గోడపై ఎండ పడినప్పుడు ఆ ఎండకి సంబంధించిన వేడి కిరణాలు గోడతోపాటూ.. ఆ చుట్టుపక్కల అంతటా వ్యాపిస్తాయి. అవి గోడలోపల, బయట కూడా ఉంటాయి. గోడ వాటిని పీల్చుకోదు. దాంతో గోడ పక్కన నీడ ఉన్నా, కిరణాల వేడి మనకు తగులుతూ, వేడిగా అనిపిస్తుంది. చెట్ల విషయంలో ఇలా జరగదు. చెట్ల ఆకులపై ఎండ పడినప్పుడు, ఆ ఆకులు.. ఆ ఎండను ఉపయోగించుకొని, ఆహారం తయారుచేసుకుంటాయి. అలాగే.. మిగతా ఎండ తమపై పడకుండా ఉండేలా ఆకులు, స్వయంగా నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. దాంతో ఆకుల దగ్గర ఓ రకమైన చల్లదనం ఉంటుంది. ఆ ఆకుల నుంచి వచ్చే గాలి కూడా చల్లబడి, చెట్టు కింద చల్లటి వాతావరణాన్ని ఏర్పరస్తుంది. అందుకే మనం చెట్ల కిందకు వెళ్తే, చల్లగా అనిపిస్తుంది.
వర్షాకాలంలో మాత్రం చెట్ల కిందకు వెళ్లకూడదు. చెట్లు పిడుగుల్ని ఆకర్షిస్తాయి. అందువల్ల చెట్లపై పిడుగులు పడుతుంటాయి. అలాంటి సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే, చనిపోయే ప్రమాదం ఉంటుంది.

No comments:
Post a Comment