మనం ఒంటెల్ని డైరెక్టుగా చూడాలంటే ఏ రాజస్థాన్‌కో వెళ్లాలి. లేదా ఒంటెల్ని పెంచుకునేవారు మన ఇళ్లవైపు వస్తే చూడగలం. జూలలో ఒంటెలు కనిపించవు. కానీ ఏనుగు లాగా వాటి నిలువెత్తు ఆకారం మనల్ని ఆకట్టుకుంటుంది. వాటిని చూసినప్పుడు మనకు ఓ డౌట్ వస్తుంది. ఒంటెలు నీరు తాగకుండా ఎక్కువ సేపు ఎలా ఉండగలవు అని. నిజమే మరి.. మనం ఎండలో ఓ గంట తిరిగితే, దాహం వేసేస్తుంది. ఆ రోజంతా మనం ఎక్కువగా నీరు తాగుతూనే ఉంటాం. ఎందుకంటే.. ఎండలో తిరిగిన గంటలోనే మన శరీరంలో చాలా నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. మరి ఒంటె విషయంలో ఏం జరుగుతుంది?
ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటిని దాచుకుంటాయనీ, అవసరమైనప్పుడు ఆ నీటిని కొద్దికొద్దిగా తాగుతాయని పిల్లలు భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. ఒంటె మూపురంలో కొవ్వు పదార్థం ఉంటుంది. ఒంటెలు 50 డిగ్రీల ఎండలో కూడా, ఎడారిలో ఏమాత్రం అలసట లేకుండా తిరగగలవు. ఎడారిలో నీరు దొరకడం చాలా కష్టం. వందల కిలోమీటర్లు నేలలో ఇసుకే తప్ప నీరు కనిపించదు. ఇలాంటి సమయంలో ఒంటెలు ఎనర్జీ కోసం మూపురాల్లోని కొవ్వును వాడుకుంటాయి. దూరం పెరిగేకొద్దీ ఒంటె మూపురం సైజు తగ్గిపోతుంది. అందులో కొవ్వు కరిగిపోతుంది. దాంతో అది వదులుగా కనిపిస్తుంది.
నీరు తాగకుండా ఎంత కాలం ఉండగలవు?
ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా మూడు వారాల వరకు ప్రయాణించగలవు. ఒంటెల ముక్కుల్లో సన్నని వెంట్రుకలు ఉండటాయి. అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తాయి. తద్వారా శరీరం నుంచి చెమట రూపంలో పోయే నీటిని భర్తీ చేసుకోగలవు. తద్వారా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గించుకోగలవు.
ఎంత నీరు తాగుతాయి?
నీరు లేకపోయినా వందల కిలోమీటర్లు, మండే ఎండలో నడిచే ఒంటెలు, ఎక్కడైనా ఒయాసిస్సు కనిపిస్తే, అక్కడ నీరు తాగుతాయి. ఆ సమయంలో అవి కొన్ని నిమిషాల్లోనే దాదాపు 100 లీటర్ల నీరు తాగగలవు. మనిషి ఒకేసారి చాలా ఎక్కువ నీరు తాగితే, చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఒంటెల విషయంలో అలా జరగదు. వాటి రక్తంలోని ఎర్ర రక్తకణాలు గోళాకారంలో, గుండ్రంగా ఉంటాయి. అందువల్ల ఎంత నీరు తాగినా, వాటి బాడీలోని ద్రవాల్లో తేడాలు రావు. అందువల్ల వాటికి ఏ హానీ జరగదు. ఇలా ఎడారుల్లో నడవడానికీ, బతకడానికీ అనుకూలంగా ఒంటెల జీవన శైలి ఉంటుంది. అందుకే వాటిని ఎడారి ఓడ అంటారు.

No comments:
Post a Comment