Is Curry leaves Tree at home is not good? - ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉండకూడదా? దోషమా?
భారత దేశంలో కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. ఓ వైపు మన పెద్దలు వృక్షో రక్షతి రక్షితః అంటారు. అంటే, చెట్లను మనం కాపాడితే, అవి మనల్ని కాపాడతాయని అర్థం. సైంటిఫిక్‌గా కూడా ఇది నిజమే. చెట్లు వాయు కాలుష్యాన్ని పీల్చుకొని, మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఐతే, వాస్తు నిపుణుల్లో కొందరు ఇంటి ముందు, లేదా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉండకూడదు అంటారు. ఉంటే ఏమవుతుంది? అది కూడా చెట్టేగా? అనే ప్రశ్న తెరపైకి వస్తుంది.
వాస్తు శాస్త్రం చాలా విస్తృతమైనది. దాన్ని పైపైన అర్థం చేసుకుంటే, సరిగా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే, ఈ రోజుల్లో వాస్తు శాస్త్రాన్ని చాలా మంది ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. ఎవరికి వారే, వాస్తు నిపుణులుగా చెప్పుకుంటూ, రకరకాల అంశాల్ని తెరపైకి తెస్తున్నారు. దాంతో అసలు ఆ శాస్త్రానికి ఉన్న, వాస్తవికత లోపిస్తోంది.
కరివేపాకు చెట్టు సంగతి చూస్తే, ఈ చెట్టు చాలా అందంగా ఉంటుంది. త్వరగా పెరుగుతుంది. మనం రోజూ కూరల్లో కరివేపాకును వాడుతాం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ చెట్టును ఇంటి ముందు పెంచవద్దని వాస్తు నిపుణులు ఎందుకు చెబుతారు అంటే.. ఇది ఇంటి దగ్గర ఉంటే, ఇరుగు పొరుగు వారు.. తరచూ వచ్చి, ఓ నాలుగు రెబ్బలు కరివేపాకు ఇమ్మని అడుగుతారు. దాంతో ఇంట్లో వాళ్లకు ఇది చికాకు కలిగిస్తుంది. అంతేకాదు.. ఈ చెట్టు చాలా ఎత్తు పెరిగి.. కరెంటు వైర్లకు అడ్డు రాగలదు. తద్వారా చెట్టు కొమ్మల ద్వారా కరెంటు పాసై, ముట్టుకున్నవారికి కరెంటు షాక్ కొట్టగలదు.
ఇంకా, ఈ చెట్టు వేర్లు.. ఇంటి పునాదిని దెబ్బతియ్యగలవు. అంతేకాదు ఇది ఇంటి ముందు ఉంటే, లోపలికి వచ్చేవారికి దీని కొమ్మలు అడ్డు అవుతాయి. ఇంకా ఈ చెట్టు గాలివానకి విరిగి పడితే, ప్రమాదమే. ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే, కరివేపాకు చెట్టును ఇంటి దగ్గర పెంచవద్దు అంటారు కొందరు వాస్తు నిపుణులు. ఐతే.. హేతువాదులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించరు. అన్ని చెట్లలాగానే కరివేపాకును కూడా ఇంటి దగ్గర పెంచుకోవచ్చని చెబుతారు. ఎవరి ఒపీనియన్ వారిది.
No comments:
Post a Comment