సాధారణంగా పర్యాటకులు సముద్ర తీరానికి ఉదయం లేదా సాయంత్రం వేళ వెళ్తారు. ఎందుకంటే వారు సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలనుకుంటారు. కొంతమంది రాత్రివేళ చందమామ రాక కోసం సముద్రం దగ్గర వేచి చూస్తారు. మన ఇళ్లు, పొలాలు, సిటీల్లో సూర్యుడు, చంద్రుడు ఒకే సైజులో కనిపిస్తాయి గానీ, సముద్రం దగ్గర మాత్రం అత్యంత పెద్ద సైజులో కనిపిస్తాయి. అది చూసినప్పుడు సూర్యుడు ఇంత పెద్దగా ఉంటాడా, చందమామను ఇంత పెద్దగా చూడొచ్చా అని ఆశ్చర్యపోతాం. ఇంతకీ అంత పెద్దగా కనిపించడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?
సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయం వంటివి.. సముద్రం దగ్గరే కాదు.. కొన్ని ఇతర ప్రదేశాల్లో కూడా పెద్దగా కనిపిస్తాయి. అలా కనిపించాలంటే, భూమి - ఆకాశం కలిసినట్లుగా ఉండాలి. సరిగ్గా అలాంటి ప్రాంతంలో పెద్దగా కనిపిస్తాయి. మీరు ఏదైనా కొండపైకి వెళ్లి, సూర్యోదయాన్ని చూస్తే, అక్కడ కూడా సూర్యుడు పెద్దగానే కనిపిస్తాడు. ఇందుకు భూమి - ఆకాశం కలిసినట్లు ఉండే ప్రాంతం మీకు దూరంగా ఉండి తీరాలి.
మధ్యాహ్నం ఎందుకిలా?
మనం గమనిస్తే, ఉదయం, సాయంత్రం పెద్ద సైజులో కనిపించే సూర్యుడు, మధ్యాహ్నం వేళ చిన్నగా ఉంటాడు. నిజానికి సూర్యుడు ఎప్పుడూ ఒకే సైజులో ఉంటాడు. మనకు వేర్వేరు సైజుల్లో కనిపించడానికి కారణం మానవ దృష్టి భ్రమ (హ్యూమన్ ఆప్టికల్ ఇల్యూషన్ - human optical illusion) అని పరిశోధనల్లో తేలింది.
ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యుడి సైజును మనం ఇతర వాటితో పోల్చి చూస్తాం. అంటే సముద్ర నీరు, ఓడలు, ఇళ్లు, చెట్ల వంటి వాటితో పోల్చి చూస్తాయి మన కళ్లు. అప్పుడు, వాటి కంటే సూర్యుడు పెద్దగా ఉన్నట్లు కనిపిస్తాడు. మధ్యాహ్నం వేళ అలా పోల్చడానికి వీలుండదు. ఎందుకంటే సూర్యుడు నడినెత్తిన, ఆకాశంలో ఉంటాడు. అందువల్ల మనకు అప్పుడు సైజ్ కంపారిజన్ లేకపోవడంతో మన కళ్లు చిన్నగా కనిపిస్తున్నట్లు భావిస్తాయి.

No comments:
Post a Comment