Friday, February 16, 2024

Are Cell towers dangerous? - సెల్‌ టవర్లు మనకు ప్రమాదకరమా?

 


పల్లెలు పట్టణాలవుతున్నాయి. పట్టణాలు సిటీలవుతున్నాయి. సిటీలు మెట్రోలవుతున్నాయి. దాంతో టెక్నాలజీపై ఆధారపడటం పెరుగుతోంది. ఇదివరకు ఇంట్లో అందరికీ ఒకటే ల్యాండ్ ఫోన్ ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే, అంతమందికీ సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. అందువల్ల సెల్ టవర్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. సిగ్నల్స్ బాగా రావాలంటే, సెల్ టవర్ల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిందే. అందుకే కంపెనీలు ఇళ్ల మధ్యలో, ఆపార్ట్‌మెంట్లపై సెల్ టవర్లు ఏర్పాటుచేస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వానికీ, ఆ అపార్ట్‌మెంట్ వారికీ అద్దె చెల్లిస్తాయి. మరి అవి మనకు మంచివేనా?


మన దేశంలో ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలున్నారు. వారిలో పిల్లల సంఖ్య 40 కోట్ల దాకా ఉంది. ఆ లెక్కన పెద్దవారు ఒక్కొక్కరూ ఒక్కో మొబైల్ కలిగివుంటే మొత్తం వాడుకలో ఉన్న మొబైళ్ల సంఖ్య 100 కోట్లు ఉండాలి. కానీ ఇండియాలో ఇప్పుడు 120 కోట్ల దాకా మొబైళ్లు వాడుకలో ఉన్నాయి. అంటే మనుషుల సంఖ్య కంటే, మొబైళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొంతమంది రెండేసి మొబైళ్లు వాడుతున్నారు. వాణిజ్య అవసరాల కోసం వాడే మొబైళ్లు కూడా ఉన్నాయి. 


ఒకప్పుడు సెల్‌ఫోన్లు ఉండటమే గొప్ప. ఇప్పుడు అంతా స్మార్ట్ యుగం. స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. కాల్స్ కోసమే కాకుండా, చాటింగ్, మనీ చెల్లింపులు, ఆన్‌లైన్ బుకింగ్స్, వీడియో వాచింగ్, ఇలా దాదాపు 100 రకాల అవసరాలకు మొబైల్స్ పనిచేస్తున్నాయి. 4G నుంచి 5Gకి వచ్చేశాం. త్వరలో 6G కోసం ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఈ మొబైల్స్ విద్యుత్ అయస్కాంత తరంగాలను వాహకాలుగా చేసుకుంటూ, ఎలక్ట్రానిక్స్‌ మాడ్యులేషన్ల పద్ధతిలో పనిచేస్తున్నాయి.


ఎలా పనిచేస్తాయి?

మీకో డౌట్ వచ్చే ఉంటుంది. ఎన్ని కోట్ల మొబైల్స్ ఉన్నా, మనం ఎవరికి కాల్ చేస్తామో, వారికే కాల్ వెళ్తుంది. ఎవరికి మనీ చెల్లిస్తామో, వారికే మనీ వెళ్తుంది. అంత పర్ఫెక్టుగా వెళ్లడానికి కారణం టెక్నాలజీ. సుమారు 800 కిలోహెర్ట్జ్‌ నుంచి సుమారు 3 గిగాహెర్ట్జ్‌ ఉన్న సూక్ష్మ తరంగాల్ని సెల్‌ఫోన్ టవర్ల ద్వారా ఒక సెల్‌ఫోన్ నుంచి మరో సెల్‌ ఫోన్‌కి పంపిస్తారు. ఈ తరంగాలు పర్ఫెక్టుగా వెళ్తాయి. 


టవర్లు ప్రమాదకరమా?

మన నిత్య జీవితంలో సెల్‌ఫోన్ టవర్లు అత్యంత ముఖ్యమైనవి. అవి లేకపోతే మన ప్రపంచం పనిచేయదు. కమ్యూనికేషన్ మొత్తం ఆగిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం మొబైల్ టవర్ల వల్ల, వాటి చుట్టుపక్కల ఉన్న ప్రజలకూ, పక్షులకూ అంతగా హాని లేదు. కానీ సెల్‌ఫోనును ఎక్కువ సేపు వాడటం మనకు మంచిది కాదు. దాని వల్ల ఉత్పత్తి అయ్యే వేడి వల్ల మన తలకు సమస్యలు రావచ్చు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. సెల్‌ఫోన్ రేడియేషన్ వల్ల మెదడు క్యాన్సర్ వస్తుందనే ప్రచారం ఉన్నా, దీనికి ఆధారాలు లేవు. అయితే, అతిగా వేడెక్కే మొబైల్ బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎక్కువ సేపు మొబైల్ మాట్లాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...