ఈ రోజుల్లో బ్యాటరీల వాడకం బాగా పెరిగింది. మొబైల్, క్లాక్, ఇంట్లోని చాలా ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌కి మనం బ్యాటరీలు ఉపయోగిస్తూ ఉంటాం. ఐతే, ఈ బ్యాటరీలు ఎలా తయారవుతాయి అనేది మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. జింకు, రాగి (Copper) లాంటి వేర్వేరు సన్నని లోహపు పలకలను (ఎలక్ట్రోడ్లు), సజల సల్ఫ్యూరిక్ ఆమ్లము (Aqueous sulfuric acid) (ఎలక్ట్రోలైట్) ఉండే పాత్రలో దూరం దూరంగా ఉంచి, వాటి మధ్య చిన్న కరెంటు బల్బును రాగి తీగ (copper wire)తో లింక్ చేస్తారు. దీన్నే విద్యుత్ ఘటం (electric cell) అంటారు. ఇలా కొన్ని విద్యుత్ ఘటాలను లింక్ చేయడమే బ్యాటరీ. ఇందులో ఏం జరుగుతుందంటే.. రెండు వేర్వేరు లోహాల మధ్య కరెంటు ప్రవహిస్తుంది.
నిమ్మకాయతో ఎలా?
ఒక నిమ్మకాయలో ఒక ఇనుము (Iron) లేదా జింకు మేకును ఉంచాలి. కొంత దూరంలో ఒక రాగి నాణాన్ని (copper coin) గుచ్చి, వాటి మధ్య రాగి తీగ (copper wire) సెట్ చేసి, ఆ తీగకు ఒక చిన్న బల్బును పెట్టి నిమ్మకాయను గట్టిగా పిండితే బల్బు వెలుగుతుంది.
ఎలా వెలుగుతుంది?
బ్యాటరీ లేకుండా బల్బు ఎలా వెలుగుతుంది అనే ప్రశ్న మనకు వస్తుంది. ఈ ప్రయోగంలో నిమ్మకాయలోని రసం (juice) ఎలక్ట్రోలైట్ లాగా పనిచేస్తుంది. అలాగని మనం నిమ్మకాయలతో కరెంటు ఉత్పత్తి చేసుకుందామనుకుంటే కుదరదు. ఎందుకంటే నిమ్మకాయ కావాల్సినంత కరెంటును ఇవ్వలేదు. అందువల్ల బల్బు సరిగా వెలగదు. కాంతి తక్కువగా ఉంటుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. నిమ్మకాయల సంఖ్య పెరిగే కొద్దీ బల్బు కాంతి పెరుగుతుంది. 5 నిమ్మకాయలను రాగి తీగ (copper wire) ద్వారా కలిపితే బల్బు బాగా వెలుగుతుంది. అంటే ఇక్కడ నిమ్మకాయలు ఎలక్ట్రిక్ బ్యాటరీల లాగా పనిచేస్తాయి.
గమనిక: ఈ నిమ్మకాయ ప్రయోగాన్ని పిల్లలు ఒంటరిగా చెయ్యకూడదు. నిపుణుల సమక్షంలో మాత్రమే చెయ్యాలి.

No comments:
Post a Comment