మనకు తెలుసు.. తుఫాను వచ్చే ముందు.. ద్రోణి ఏర్పడుతుంది. తర్వాత ఆవర్తనం, తర్వాత అల్పపీడనం ఏర్పడతాయి. క్రమంగా పీడనం పెరుగుతూ వాయుగుండం ఏర్పడుతుంది. మరింత బలపడి తుఫానుగా మారుతుంది. ఇదంతా జరగడానికి కనీసం 3 నుంచి 5 రోజులు పడుతుంది. ఇంతకీ సముద్రాల్లో ఈ సుడిగుండాలు, వాయుగుండాలు, టోర్నడో (Tornado)లు ఎలా ఏర్పడతాయి?
మీరు గమనించే ఉంటారు, రోడ్లపై అప్పుడప్పుడూ గాలి సుడిలా మారి.. రివ్వున ఒక చోటి నుంచి మరో చోటికి క్షణాల్లో వెళ్తుంది. గాలి అలా వెళ్లేటప్పుడు అక్కడున్న దుమ్ము, ఎండిన ఆకుల వంటివి గాలితోపాటూ.. గుండ్రంగా తిరుగుతూ వెళ్తాయి. ఈ సుడిగాలి మాగ్జిమం 5 సెకండ్లకు మించి ఉండదు. ఇదే విధంగా.. నీటిపై కూడా గాలి సుడిని ఏర్పరచగలదు.
నీటిలో గాలి సుడిని ఏర్పరచినప్పుడు.. ఆ సుడిలో కొన్ని పదార్థాలు వేగంగా కదులుతాయి. మరికొన్ని నెమ్మదిగా కదులుతాయి. ఇలా నీటి అణువుల వేగంలో మార్పులుంటాయి. వేగంగా తిరిగే అణువులు.. ప్రత్యే పొరను ఏర్పాటుచేస్తాయి. నెమ్మదిగా తిరిగేవి మరో పొర ఏర్పాటు చేస్తాయి. ఇలా.. రకరకాల పొరలు ఏర్పడతాయి. ఈ క్రమంలో పొరల మధ్య వేడి (ఉష్ణోగ్రత)లో మార్పులు వస్తాయి. దాంతో.. కొన్ని పొరలు బరువు తక్కువగా, కొన్ని బరువు ఎక్కువగా మారతాయి. దీన్నే సాంద్రత అంటాం.
సాంద్రత ఎక్కువగా ఉన్న పదార్థాలు.. తక్కువ సాంద్రత ఉన్నవైపు ప్రవహిస్తాయి. ఈ క్రమంలో సుడిలో మార్పులు వస్తూ.. క్రమంగా వేగాల్లోనూ మార్పులు వస్తాయి. అదే సమయంలో ఈ సుడికి గాలి తోడవ్వడం వల్ల.. సుడి వేగం పెరుగుతుంది. అలా పెరుగుతూ పెరుగుతూ.. అదో ఆవర్తనంగా, అల్పపీడనంగా, వాయుగుండంగా, తుఫానుగా మారగలదు. ఈ తుఫాన్లు సముద్రంపై ఉన్నంతకాలం.. ఎక్కువ స్వేచ్ఛతో తిరుగుతాయి. అందుకే అవి బలపడుతుంటాయి. అవి భూమివైపు వచ్చాక, తీరం దాటాక.. ఆ సుడికి చెట్లు, ఇళ్ల వంటివి అడ్డు వస్తాయి. దాంతో సుడి రూపం చెదిరిపోతుంది. వేగం తగ్గిపోతుంది. క్రమంగా తుఫాను కాస్తా, వాయుగుండంగా, అల్పపీడనంగా మారి బలహీనపడిపోతుంది.

No comments:
Post a Comment