వానంటే మనందరికీ ఇష్టమే. వాన వచ్చే ముందు నల్లటి మేఘాలు ముసురుతాయి. చల్లటి గాలి వస్తుంది. దుమ్ము లేస్తుంది. అంతా చీకటిగా మారుతుంది. సరిగ్గా అప్పుడే టపటపా చినుకులు నేలపై పడతాయి. చల్లటి ఆ చినుకుల్లో తడుస్తుంటే, ఆదో ఆనందం. ఇలా ఎప్పుడో ఓసారి పడే వాన మనకు బాగా నచ్చుతుంది. చాలా మందికి వానలో తడవడం ఇష్టం ఉండదు. కానీ ఆ వాన పడటాన్ని చూడటం ఇష్టం. ఆ దృశ్యాన్ని మనసులో పదిలం చేసుకుంటారు. ఇంతకీ వాన చినుకులు గుండ్రంగా ఎందుకుంటాయి?
వాన నీరు అంటే.. ద్రవ పదార్థం. ఇలాంటి పదార్థాల ఉపరితలం సాగదీసిన పొరలాగా స్థితిస్థాపకత (elasticity) కలిగి ఉంటుంది. అలాగే బిగువు (tension) కూడా ఉంటుంది. దీన్నే తలతన్యత (surface tension) అంటారు.
ద్రవాలకు స్వేచ్ఛ లభించినప్పుడు అణువులు నిరంతరం దగ్గరకు జరిగేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా అవి తక్కువ ప్రదేశంలో ఇరుక్కునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఆకారాలన్నింటిలోనూ, తక్కువ ఉపరితల వైశాల్యం ఉండేది.. గోళాకారానికే కావడంతో.. నీటి బిందువులు.. గోళాకారంలోకి మారుతాయి.
మేఘాల్లో నీటి అణువులు చల్లదనం వల్ల దగ్గరకు జరుగుతాయి. దాంతో అవి నీటి బిందువుగా మారతాయి. బిందువుగా మారినప్పుడు వాటి బరువును భూమ్యాకర్షణ శక్తి ఆకర్షిస్తుంది. దాంతో ఆ చినుకులు భూమివైపు వస్తాయి. ఇలా వచ్చే సమయంలో ఆ నీటి చుక్కలకు స్వేచ్ఛ ఉంటుంది. దాంతో అవి.. సర్ఫేస్ టెన్షన్ పొందుతూ.. గుండ్రంగా మారతాయి. ఇలా వాన చినుకులే కాదు, పాల చినుకులు, పాదరసం (mercury), కూల్ డ్రింక్స్ రసాయనాల వంటివన్నీ గుండ్రంగానే మారతాయి.

No comments:
Post a Comment