Friday, February 23, 2024

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?


మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఐతే... మీరెప్పుడైనా ఆలోచించారా.. నిండా కన్నాలు ఉండే స్పాంజీ, నీరు ఎలా పీల్చుకుంటోంది అని? దీన్ని ఎలా తయారుచేస్తారో మీకు తెలుసా?


స్పాంజి ఒక ప్లాస్టిక్‌ పాలిమర్‌. అంటే..ఇదొక పాలిమర్ ముద్ద. కాకపోతే ఇందులో చాలా కన్నాల గదులు ఉంటాయి. ఒక గదిలోంచీ మరో కన్నంలోకి గాలి, నీరు వెళ్లేలా వీలు ఉంటుంది. ఈ కన్నాల వల్లే స్పాంజీ చాలా పెద్దగా కనిపిస్తుంది. నిజానికి అవి లేకపోతే, దాని సైజు చిన్నగా ఉంటుంది. కన్నాల వల్లే అది బరువు తక్కువగా, తేలికగా ఉంటుంది.


ఈ స్పాంజీ తయారీలో ప్రత్యేక పద్ధతిని ఉపయోగిస్తారు. దీన్ని తయారుచేసేటప్పుడు లిక్విడ్ లాగా ఉండే పాలిమర్‌లోకి గాలి లేదా నైట్రోజన్ లేదా కార్బన్ డై ఆక్సైడ్‌ని నురగ రూపంలో పంపుతారు. దాంతో పాలిమర్‌లోకి అవి చొచ్చుకెళ్లి.. నిండిపోతాయి. ఆ తర్వాత పాలిమర్‌లో లిక్విడ్ ఆరిపోతుంది. దాంతో చిల్లుల స్పాంజీ తయారవుతుంది.


ఇంతకీ స్పాంజీలో నుంచి నీరు పోకుండా లోపల ఎలా ఉంటుంది అనేది కీలక ప్రశ్న. నీటికి పాకే గుణం ఉంటుంది. దీన్నే కాపిల్లారిటీ అంటారు. నీటి అణువులు ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి. అలా అవి కలిసివుండేందుకు ప్రయత్నిస్తాయి. స్పాంజీలో నీటి చుక్కలు చిన్న చిన్నగా ఉంటూ.. వాటి మధ్య ఓ బంధాన్ని ఏర్పరచుకుంటాయి. మనం స్పాంజీని నొక్కినప్పుడు వాటి మధ్య తేడా వచ్చి, నీటి బిందువులు పెద్దవిగా అవుతాయి. దాంతో భూమి ఆకర్షణకు లోనై, స్పాంజీ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఇలా ఈ స్పాంజీ వెనక పెద్ద కథే ఉంది.



Thursday, February 22, 2024

Is Curry leaves Tree at home is not good? - ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉండకూడదా? దోషమా?

 


భారత దేశంలో కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. ఓ వైపు మన పెద్దలు వృక్షో రక్షతి రక్షితః అంటారు. అంటే, చెట్లను మనం కాపాడితే, అవి మనల్ని కాపాడతాయని అర్థం. సైంటిఫిక్‌గా కూడా ఇది నిజమే. చెట్లు వాయు కాలుష్యాన్ని పీల్చుకొని, మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఐతే, వాస్తు నిపుణుల్లో కొందరు ఇంటి ముందు, లేదా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉండకూడదు అంటారు. ఉంటే ఏమవుతుంది? అది కూడా చెట్టేగా? అనే ప్రశ్న తెరపైకి వస్తుంది.

వాస్తు శాస్త్రం చాలా విస్తృతమైనది. దాన్ని పైపైన అర్థం చేసుకుంటే, సరిగా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే, ఈ రోజుల్లో వాస్తు శాస్త్రాన్ని చాలా మంది ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. ఎవరికి వారే, వాస్తు నిపుణులుగా చెప్పుకుంటూ, రకరకాల అంశాల్ని తెరపైకి తెస్తున్నారు. దాంతో అసలు ఆ శాస్త్రానికి ఉన్న, వాస్తవికత లోపిస్తోంది. 

కరివేపాకు చెట్టు సంగతి చూస్తే, ఈ చెట్టు చాలా అందంగా ఉంటుంది. త్వరగా పెరుగుతుంది. మనం రోజూ కూరల్లో కరివేపాకును వాడుతాం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ చెట్టును ఇంటి ముందు పెంచవద్దని వాస్తు నిపుణులు ఎందుకు చెబుతారు అంటే.. ఇది ఇంటి దగ్గర ఉంటే, ఇరుగు పొరుగు వారు.. తరచూ వచ్చి, ఓ నాలుగు రెబ్బలు కరివేపాకు ఇమ్మని అడుగుతారు. దాంతో ఇంట్లో వాళ్లకు ఇది చికాకు కలిగిస్తుంది. అంతేకాదు.. ఈ చెట్టు చాలా ఎత్తు పెరిగి.. కరెంటు వైర్లకు అడ్డు రాగలదు. తద్వారా చెట్టు కొమ్మల ద్వారా కరెంటు పాసై, ముట్టుకున్నవారికి కరెంటు షాక్ కొట్టగలదు.

ఇంకా, ఈ చెట్టు వేర్లు.. ఇంటి పునాదిని దెబ్బతియ్యగలవు. అంతేకాదు ఇది ఇంటి ముందు ఉంటే, లోపలికి వచ్చేవారికి దీని కొమ్మలు అడ్డు అవుతాయి. ఇంకా ఈ చెట్టు గాలివానకి విరిగి పడితే, ప్రమాదమే. ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే, కరివేపాకు చెట్టును ఇంటి దగ్గర పెంచవద్దు అంటారు కొందరు వాస్తు నిపుణులు. ఐతే.. హేతువాదులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించరు. అన్ని చెట్లలాగానే కరివేపాకును కూడా ఇంటి దగ్గర పెంచుకోవచ్చని చెబుతారు. ఎవరి ఒపీనియన్ వారిది.



Wednesday, February 21, 2024

Why Sun and Moon appear in big size at Sea - సముద్రం దగ్గర సూర్యుడు, చంద్రుడు ఎందుకు పెద్ద సైజులో కనిపిస్తాయి?

 


సాధారణంగా పర్యాటకులు సముద్ర తీరానికి ఉదయం లేదా సాయంత్రం వేళ వెళ్తారు. ఎందుకంటే వారు సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలనుకుంటారు. కొంతమంది రాత్రివేళ చందమామ రాక కోసం సముద్రం దగ్గర వేచి చూస్తారు. మన ఇళ్లు, పొలాలు, సిటీల్లో సూర్యుడు, చంద్రుడు ఒకే సైజులో కనిపిస్తాయి గానీ, సముద్రం దగ్గర మాత్రం అత్యంత పెద్ద సైజులో కనిపిస్తాయి. అది చూసినప్పుడు సూర్యుడు ఇంత పెద్దగా ఉంటాడా, చందమామను ఇంత పెద్దగా చూడొచ్చా అని ఆశ్చర్యపోతాం. ఇంతకీ అంత పెద్దగా కనిపించడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?


సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయం వంటివి.. సముద్రం దగ్గరే కాదు.. కొన్ని ఇతర ప్రదేశాల్లో కూడా పెద్దగా కనిపిస్తాయి. అలా కనిపించాలంటే, భూమి - ఆకాశం కలిసినట్లుగా ఉండాలి. సరిగ్గా అలాంటి ప్రాంతంలో పెద్దగా కనిపిస్తాయి. మీరు ఏదైనా కొండపైకి వెళ్లి, సూర్యోదయాన్ని చూస్తే, అక్కడ కూడా సూర్యుడు పెద్దగానే కనిపిస్తాడు. ఇందుకు భూమి - ఆకాశం కలిసినట్లు ఉండే ప్రాంతం మీకు దూరంగా ఉండి తీరాలి.


మధ్యాహ్నం ఎందుకిలా?

మనం గమనిస్తే, ఉదయం, సాయంత్రం పెద్ద సైజులో కనిపించే సూర్యుడు, మధ్యాహ్నం వేళ చిన్నగా ఉంటాడు. నిజానికి సూర్యుడు ఎప్పుడూ ఒకే సైజులో ఉంటాడు. మనకు వేర్వేరు సైజుల్లో కనిపించడానికి కారణం మానవ దృష్టి భ్రమ (హ్యూమన్ ఆప్టికల్ ఇల్యూషన్ - human optical illusion) అని పరిశోధనల్లో తేలింది. 


ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యుడి సైజును మనం ఇతర వాటితో పోల్చి చూస్తాం. అంటే సముద్ర నీరు, ఓడలు, ఇళ్లు, చెట్ల వంటి వాటితో పోల్చి చూస్తాయి మన కళ్లు. అప్పుడు, వాటి కంటే సూర్యుడు పెద్దగా ఉన్నట్లు కనిపిస్తాడు. మధ్యాహ్నం వేళ అలా పోల్చడానికి వీలుండదు. ఎందుకంటే సూర్యుడు నడినెత్తిన, ఆకాశంలో ఉంటాడు. అందువల్ల మనకు అప్పుడు సైజ్ కంపారిజన్ లేకపోవడంతో మన కళ్లు చిన్నగా కనిపిస్తున్నట్లు భావిస్తాయి.



Tuesday, February 20, 2024

Why do fruits ripen seasonally? - పండ్లు సీజన్ల వారీగా ఎందుకు కాస్తాయి?


మీరు గమనించే ఉంటారు అరటి, జామ లాంటి కొన్ని పండ్లు  తప్పితే, చాలా పండ్లు సీజన్ల వారీగా కాస్తాయి. అంటే సీతాఫలాలు శీతాకాలంలో వస్తాయి. యాపిల్స్ వర్షాకాలంలో వస్తాయి. మామిడిపండ్లు, పుచ్చకాయలు ఎండాకాలంలో వస్తాయి. ఇలా ఒక్కో సీజన్‌లో ఒక్కో రకమైన పండ్లు ఎక్కువగా లభిస్తాయి. అవి సంవత్సరమంతా లభించవచ్చు కదా అని మనకు అనిపించవచ్చు. మరి అలా ఎందుకు జరగదో తెలుసుకుందాం.


మనకి ఎలాగైతే జన్యువులు (Genes) ఉంటాయో, చెట్లకూ అలాగే ఉంటాయి. ఒక్కో చెట్టుకి ఒక్కో రకమైన జెనెటిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌కి తగినట్లే ఆ చెట్టు ఆకారం, ఆకుల తీరు, పండ్ల రుచి ఇలా అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఐతే.. ఈ కోడ్‌ని అనుసరించి ఆయా చెట్లు పండ్లను కాస్తాయి. చెట్లు చేసే ప్రతీ పనీ ఈ జన్యువులపై ఆధారపడి ఉంటుంది. చెట్లకు పువ్వులు, కాయలు, పండ్లు రావాలంటే.. వాతావరణంలో లభించే వివిధ రకాల మూలకాలు అవసరం. అంటే తగిన ఉష్ణోగ్రత, తగిన గాలి, తగిన పోషకాలు, తగిన తేమ, భూమిలో తగిన ఖనిజాలు ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కావాల్సిన మోతాదులో అందినప్పుడే ఆ చెట్లు పండ్లను ఇస్తాయి. 


జన్యువుల ప్రకారం కావాల్సిన వాటిలో ఏదైనా తగ్గితే, పండ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే పండ్ల సైజు, వాసన, రుచిలో కూడా తేడా వస్తుంది. అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడు వచ్చే పండ్లు చాలా పెద్దగా, రుచికరంగా ఉంటాయి. జపాన్ లాంటి దేశాల్లో రైతులు అత్యంత ఆధునిక పద్ధతులతో పండ్లను పండిస్తూ, రుచి, సైజు, నాణ్యత అన్నీ పక్కాగా ఉండేలా చేస్తారు. అందువల్లే జపాన్ పండ్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది.


జన్యువుల తీరును బట్టీ.. ఆయా చెట్లు.. ఆయా సీజన్లలో తమకు కావాల్సిన వాటిని పొందుతాయి. తద్వారా పువ్వులు, పండ్లను ఇస్తాయి. జామ చెట్లకు ఉన్న జన్యువుల ప్రకారం.. ఆ చెట్లు సంవత్సరమంతా కాయలు ఇవ్వగలవు. అదే సీతాఫలం విషయానికి వచ్చే సరికి.. వాటికి తక్కువ ఎండ, గాలిలో తేమ ఉండాలి. వరికి ఎక్కువ నీరు, ఎక్కువ ఎండ ఉండాలి. మామిడికి ఎండ బాగా ఉండాలి. ఇండియా లాంటి దేశంలో సంవత్సరానికి 6 రకాల సీజన్ల మార్పులు వస్తాయి. అందుకు తగినట్లుగానే మన దేశంలో అన్ని రకాల కాయలు, పండ్లూ కాస్తాయి.  

How camel live long without thirsy? - ఒంటెలు నీరు తాగకుండా ఎక్కువ సేపు ఎలా ఉండగలవు?


మనం ఒంటెల్ని డైరెక్టుగా చూడాలంటే ఏ రాజస్థాన్‌కో వెళ్లాలి. లేదా ఒంటెల్ని పెంచుకునేవారు మన ఇళ్లవైపు వస్తే చూడగలం. జూలలో ఒంటెలు కనిపించవు. కానీ ఏనుగు లాగా వాటి నిలువెత్తు ఆకారం మనల్ని ఆకట్టుకుంటుంది. వాటిని చూసినప్పుడు మనకు ఓ డౌట్ వస్తుంది. ఒంటెలు నీరు తాగకుండా ఎక్కువ సేపు ఎలా ఉండగలవు అని. నిజమే మరి.. మనం ఎండలో ఓ గంట తిరిగితే, దాహం వేసేస్తుంది. ఆ రోజంతా మనం ఎక్కువగా నీరు తాగుతూనే ఉంటాం. ఎందుకంటే.. ఎండలో తిరిగిన గంటలోనే మన శరీరంలో చాలా నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. మరి ఒంటె విషయంలో ఏం జరుగుతుంది?


ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటిని దాచుకుంటాయనీ, అవసరమైనప్పుడు ఆ నీటిని కొద్దికొద్దిగా తాగుతాయని పిల్లలు భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. ఒంటె మూపురంలో కొవ్వు పదార్థం ఉంటుంది. ఒంటెలు 50 డిగ్రీల ఎండలో కూడా, ఎడారిలో ఏమాత్రం అలసట లేకుండా తిరగగలవు. ఎడారిలో నీరు దొరకడం చాలా కష్టం. వందల కిలోమీటర్లు నేలలో ఇసుకే తప్ప నీరు కనిపించదు. ఇలాంటి సమయంలో ఒంటెలు ఎనర్జీ కోసం మూపురాల్లోని కొవ్వును వాడుకుంటాయి. దూరం పెరిగేకొద్దీ ఒంటె మూపురం సైజు తగ్గిపోతుంది. అందులో కొవ్వు కరిగిపోతుంది. దాంతో అది వదులుగా కనిపిస్తుంది. 


నీరు తాగకుండా ఎంత కాలం ఉండగలవు?

ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా మూడు వారాల వరకు ప్రయాణించగలవు. ఒంటెల ముక్కుల్లో సన్నని వెంట్రుకలు ఉండటాయి. అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తాయి. తద్వారా శరీరం నుంచి చెమట రూపంలో పోయే నీటిని భర్తీ చేసుకోగలవు. తద్వారా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గించుకోగలవు. 


ఎంత నీరు తాగుతాయి?

నీరు లేకపోయినా వందల కిలోమీటర్లు, మండే ఎండలో నడిచే ఒంటెలు, ఎక్కడైనా ఒయాసిస్సు కనిపిస్తే, అక్కడ నీరు తాగుతాయి. ఆ సమయంలో అవి కొన్ని నిమిషాల్లోనే దాదాపు 100 లీటర్ల నీరు తాగగలవు. మనిషి ఒకేసారి చాలా ఎక్కువ నీరు తాగితే, చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఒంటెల విషయంలో అలా జరగదు. వాటి రక్తంలోని ఎర్ర రక్తకణాలు గోళాకారంలో, గుండ్రంగా ఉంటాయి. అందువల్ల ఎంత నీరు తాగినా, వాటి బాడీలోని ద్రవాల్లో తేడాలు రావు. అందువల్ల వాటికి ఏ హానీ జరగదు. ఇలా ఎడారుల్లో నడవడానికీ, బతకడానికీ అనుకూలంగా ఒంటెల జీవన శైలి ఉంటుంది. అందుకే వాటిని ఎడారి ఓడ అంటారు.

Monday, February 19, 2024

Where is Flight MH370?


Disappearance of Malaysia Airlines Flight MH370 has captivated people for decades. On March 8, 2014, the aircraft, a Boeing 777-200ER, vanished while flying from Kuala Lumpur International Airport in Malaysia to Beijing Capital International Airport in China.

The last known position of MH370 was over the southern Indian Ocean, but despite extensive search efforts, the wreckage of the plane was not found for a considerable amount of time. In July 2015, a piece of the wing, known as a flaperon, washed ashore on Reunion Island in the Indian Ocean, confirming that the plane had indeed crashed.

However, the main wreckage and the majority of the passengers' remains have never been located. The disappearance has led to numerous theories and speculation, ranging from mechanical failures to deliberate actions by the crew. The mystery of MH370 remains unsolved, and it has become one of the most perplexing aviation mysteries in history.

What Vastu Shastra say about 4 directions? - వాస్తు శాస్త్రం ప్రకారం 4 దిశల్లో ఏవేవి, ఎక్కడ ఉండాలి?

 


మనం దిక్కులు అనగానే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెప్పుకుంటాం. వాస్తు శాస్త్రం.. మరో 4 దిక్కులను కూడా చెబుతుంది. అవే ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం (ఆనైవాఈ). ఈ నాలుగు దిక్కుల్లో ఏయే వస్తువులు ఎక్కడ ఉండాలో వాస్తు నిపుణులు చెబుతారు. అవి అలా ఉంటే, వాస్తు దోషం ఉండదని అంటారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఆగ్నేయం:

ఆగ్నేయ దిశలో కిచెన్ గది ఉంటూ, అందులో స్టవ్‌ని ఆగ్నేయ మూలలో ఉంచాలి. వంట వండేటప్పుడు వచ్చే పొగ బయటికి వెళ్లేలా దక్షిణ ఆగ్నేయం (SE), తూర్పు ఆగ్నేయం (ES)లో కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వంట వండేటప్పుడు తప్పనిసరిగా కిటికీలు తెరచి ఉంచాలి. తద్వారా పొగ బయటకు పోయి, క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుంది.


నైరుతి:

నైరుతి దిశలో మనకు కావాల్సిన వస్తువుల్నీ, విలువైన వాటినీ, పత్రాలనూ దాచుకోవాలి. ఇంటి యజమాని ఈ దిశలో ఉండాలి. త్వారా దక్షిణం నుంచి వచ్చే గాలి ఇంటి యజమానికి తగులుతుంది. పడమర నైరుతి (WS), దక్షిణ నైరుతి (SW) దిక్కు నుంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ గది కీలకమైనది కాబట్టి భద్రత పరంగా గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే.. నైరుతి దిశలో బరువు ఉండాలి. అందువల్ల నీటిని స్టోర్ చేసే ఓవర్‌హెడ్ ట్యాంకును ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు.


వాయవ్యం:

వాయవ్య దిశలో బాత్‌రూమ్, టాయిలెట్, పశువుల పెంపకం వంటివి చేస్తారు. ఈ దిశ నుంచి వచ్చే గాలి, చెడు వాసనలు ఇంట్లోకి రాకుండా, ఆ వాసనలు బయటకు పోయేలా ఏర్పాట్లు ఉండాలి.


ఈశాన్యం:

ఈశాన్య దిశలో నుయ్యి లేదా బోరు వేసుకోవచ్చు లేదా నీటిని స్టోర్ చేసే సంపు కూడా నిర్మించుకోవచ్చు. ఈ దిశలో ఎక్కువ స్థలం ఖాళీగా  ఉండాలి. ఎండ, గాలి బాగా వచ్చేలా చెయ్యాలి. తద్వారా నీరు శుభ్రంగా ఉంటుంది.


ఇంకా వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని మొత్తం అర్థం చేసుకోవడానికి ఓ సంవత్సరం పట్టొచ్చు. వాస్తు శాస్త్రం చాలా విస్తృతమైనది. ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని ఫాలో అవుతున్నాయి. కొన్ని దేశాల్లో వేర్వేరు పేర్లతో ఇది ఆచరణలో ఉంది. ఇండియాలో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు, భవనాలు, బ్యారేజ్‌లు ఇలా ప్రతీ దానికీ ఇంజినీరింగ్ ఫార్ములాలతోపాటూ.. వాస్తు నియమాలు కూడా పాటిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తున్న ఆచారంగా మారింది. వాస్తును నమ్మని వారు సైతం.. తమ ఇళ్ల నిర్మాణంలో వాస్తును పాటిస్తుంటారు. పాటిస్తే పోయేదేముంది అని భావిస్తారు.


Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని E-పలుకు నిర్ధారించట్లేదని గమనించగలరు.

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...