వెంట్రుకలు నల్లగా ఉన్నంతకాలం మనకు సమస్యగా అనిపించదు. ఒక్కసారి అవి తెల్లగా అవ్వడం మొదలైతే, ఇక ఆందోళన మొదలవుతుంది. చుట్టుపక్కల వాళ్లు తెల్ల జుట్టు వచ్చేస్తోంది అని కామెంట్లు చేస్తే, అది మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. సహజంగా వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో వయసుతో సంబంధం లేకుండా కలర్ మారిపోతుంది. జుట్టుకు నల్ల రంగును తెచ్చే మెలనిన్, తలలోని చర్మం కింది భాగంలో, వెంట్రుకల్లో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల జుట్టు తెలుపు రంగులో కనిపిస్తుంది. అంటే తెలుపు అనేది రంగు కాదు. ప్రతీ వెంట్రుకా పారదర్శకంగా, ఓ గొట్టంలా ఉంటుంది. అందులో మెలనిన్ ఉంటే అది నలుపు రంగులో కనిపిస్తుంది. మెలనిన్ లేకపోతే, గొట్టం ఖాళీగా ఉండి, వెంట్రుక తెలుపుగా కనిపిస్తుందంతే.
మెలనిన్ ఉత్పత్తి ఆగిపోవడానికి కారణాలు:
జన్యువులు:
తల్లిదండ్రులకూ, తాత ముత్తాతలకు త్వరగా వైట్ హైయిర్ వస్తే, వాళ్ల పిల్లలకూ, మనవళ్లకు కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయి. దీనికి కారణం DNA. దీన్నే మనం జన్యువులు అంటాం. జన్యువుల్లో మార్పులు తెస్తే, ఇలా అవ్వకుండా చెయ్యవచ్చు. దీనిపై నిరతరం పరిశోధనలు జరుగుతున్నాయి.
టెన్షన్లు:
పని ఒత్తిళ్లు, టెన్షన్లు, బిజీ లైఫ్ స్టైల్, నిద్రలేమి, ఆహార మార్పులు, హైబీపీ వంటివి మన తలలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
ఆటో ఇమ్యూన్ డిసీజ్:
ఒక్కోసారి మన శరీరంలోని వ్యాధి నిరోధకత తన సొంత కణాలపైనే దాడి చేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
థైరాయిడ్ సమస్య:
మన గొంతులో సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది శరీరంలోని చాలా అవయవాలు సరిగా పనిచేసేలా చేస్తుంది. ఇది సరిగా పనిచెయ్యకపోతే… మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
విటమిన్ B-12 తగ్గిపోతే:
త్వరగా జుట్టు నెరిసిపోయిందంటే దానర్థం మనలో విటమిన్ B-12 సరిపడా లేనట్లే. ఇది జుట్టుకు ఎంతో మేలు చేసే విటమిన్. ఇది ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ఎర్రరక్తకణాలు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ బీ-12 సహకరిస్తుంది. అది లేనప్పుడు ఎర్రరక్తకణాలు దెబ్బతిని, జుట్టు కణాలకు సరైన ఎర్రరక్తకణాలు చేరవు. ఫలితంగా జుట్టు కణాలు దెబ్బతిని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. విటమిన్ B-12 కోసం చేపలు, బాదం, పీతలు, పాలు, వెన్న, గుడ్లు, చికెన్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు.
స్మోకింగ్:
పొగతాగడం మానకపోతే, అది జుట్టుకి పొగబెడుతుందని పరిశోధనల్లో తేలింది. ఎలాగంటే పొగ ఎర్రరక్తకణాల్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా ఏమవుతుందో మీకు తెలుసు.
పరిష్కార మార్గాలు:
జన్యుపరంగా జుట్టు తెల్లబడితే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇతర కారణాలతో మార్పులు వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. జుట్టు మెలనిన్ పెంచుకోవడానికి క్యారెట్, నల్ల నువ్వులు, వాల్‌నట్స్, ఉసిరి, సాల్మన్ చేపలు, పుట్టగొడుగులు, మసూరి పప్పులు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి.
నల్ల జుట్టు కోసం చిట్కా:
నువ్వుల నూనె, మెంతుల పొడిని కలిపి తలకు మసాజ్ చేసి, అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకల్లో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుందని తెలిసింది.
(గమనిక: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి)